Madhya Pradesh: కరోనా కలకలం.. మధ్యప్రదేశ్ లోని ఓ జిల్లాలో కర్ఫ్యూ
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- బాలాఘాట్ జిల్లాలో నైట్ కర్ఫ్యూ విధించిన మధ్యప్రదేశ్
- మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న బాలాఘాట్ జిల్లా
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా బాలాఘాట్ జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూని విధించింది. రాజధాని భోపాల్ కు ఈ జిల్లా 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జిల్లా మహారాష్ట్రకు ఆనుకుని ఉండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ప్రతిరోజు 5 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
బాలాఘాట్ జిల్లా అధికారులు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఐదుగురికి మించి ప్రజలు గుమికూడరాదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు కానీ, వాహనాలు కానీ తిరగడానికి వీల్లేదు. మరోవైపు మహారాష్ట్ర నుంచి వస్తున్న అందరికీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం టెస్టులు చేయిస్తోంది.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు ఇలాగే పెరిగితే మరో రెండు వారాల్లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు.