Manoj Tiwari: మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరుతున్నా: క్రికెటర్ మనోజ్ తివారీ
- టీమిండియా తరపున వన్డేలు, టీ20లు ఆడిన మనోజ్ తివారీ
- ఇటీవల టీఎంసీకి, మంత్రి పదవికి గుడ్ బై చెప్పిన లక్ష్మీ రతన్ శుక్లా
- శుక్లా స్థానాన్ని భర్తీ చేయగల సెలబ్రిటీ తివారీ అని భావిస్తున్న టీఎంసీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ ప్రకటించాడు. హుగ్లీలోని చిన్సూరాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు నిర్వహించే ర్యాలీలో పార్టీలో చేరుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మనోజ్ తివారీ వెల్లడించాడు. 'ఈరోజు నుంచి నా జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. మీ అందరి ప్రేమాభిమానాలు, మద్దతు నాకు అవసరం' అని ట్వీట్ చేశాడు.
టీమిండియా తరపును మనోజ్ తివారీ వన్డేలు, టీ20 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఈ సందర్భంగా టీఎంసీకి సంబంధించిన శ్రేణులు మాట్లాడుతూ, లక్ష్మీ రతన్ శుక్లా స్థానాన్ని భర్తీ చేయగల సెలబ్రిటీగా మనోజ్ తివారీని తాము భావించామని చెప్పారు. నాలుగు వారాల క్రితం తివారీని తాము కలిసి, పార్టీలో చేరే అంశంపై చర్చించామని తెలిపారు.
లక్ష్మీ రతన్ శుక్లా హౌరా జిల్లా క్రికెట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన టీఎంసీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడలపై దృష్టి సారించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. మరోవైపు టీఎంసీ జిల్లా నేతల ఆధిపత్యపోరును భరించలేకే ఆయన పార్టీని వీడినట్టు కొందరు చెపుతున్నారు.
మరోవైపు మనోజ్ తివారీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశాలను నిర్వహించారు. టీఎంసీలో చేరాల్సిందిగా సూచించారు. ఈ భేటీల అనంతరం మమతను తివారీ కలిశారు. పార్టీలో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశాడు.