Hyderabad: దొంగను వెంబడించి ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించిన హైద‌రాబాద్ అమ్మాయి!

girl chased and nabbed thief

  • యూసఫ్ గూడ‌లో ఘ‌ట‌న‌
  • స్మార్ట్ ఫోన్ లాక్కొని పారిపోతున్న దొంగ‌
  • అత‌డి వెన‌కాలే ప‌రిగెత్తిన యువ‌తి
  • ఓ చోట దొంగ‌ కాల‌ర్ ప‌ట్టుకుని లాగిన అమ్మాయి
  • అనంత‌రం 100కు ఫోన్

దొంగ‌లు స్మార్ట్‌ఫోన్లు, మెడ‌లోంచి త‌మ‌ చైన్లను లాక్కుని పారిపోతుంటే చాలా మంది మ‌హిళ‌లు కేకలు వేస్తూ సాయం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే, ఓ యువ‌తి మాత్రం అలా చేయ‌కుండా దొంగ‌ను 600 మీట‌ర్లు వెంబ‌డించి చివ‌ర‌కు అత‌డిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించింది.

ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని యూసఫ్ గూడ‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే సికింద్రాబాద్‌కు చెందిన భూమిక అనే యువతి ఓ బొటిక్‌లో డిజైనర్‌గా పనిచేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని త‌న కార్యాల‌యంలో విధులు ముగించుకుని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ‌వద్దకు మెట్రో రైలు ఎక్కేందుకు న‌డుచుకుంటూ వెళ్తోంది.

అదే స‌మ‌యంలో ఫోన్ రావ‌డంతో మాట్లాడుతూ న‌డుస్తోంది. ఆమె వెనకాలే వ‌చ్చిన ఓ దొంగ ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కొని పరుగు తీశాడు. దీంతో భూమిక అరుస్తూ.. దొంగ వెనకాలే పరిగెత్తింది. ఆ త‌ర్వాత రోడ్డుపై ఓ స్కూటీని ఆపి, ఆ వాహ‌న‌దారుడికి విషయం చెప్పింది.

దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి భూమిక‌ను ఎక్కించుకొని దొంగను వెతికాడు.   శ్రీకృష్ణానగర్‌లోని సింధు టిఫిన్‌ సెంటర్ వీధిలో దొంగ‌ను గుర్తించిన భూమిక అత‌డి కాలర్ ‌పట్టుకొని లాగి, అత‌డి చేతిలో ఉన్న తన సెల్‌ఫోన్‌ను లాక్కుంది.

అనంత‌రం స్థానికులు కూడా ఆమెకు సాయం చేసి దొంగ పారిపోకుండా ప‌ట్టుకున్నారు. భూమిక 100కి ఫోన్‌‌ చేయడంతో వెంట‌నే జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని దొంగ‌ను అరెస్టు చేశారు. అత‌డి పేరు జే న‌వీన్ నాయ‌క్ (20)గా గుర్తించారు.

  • Loading...

More Telugu News