Pawan Kalyan: మత్స్యపురిలో జనసేన విజయం భరించలేక వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు పాల్పడుతున్నాడు: పవన్ కల్యాణ్

Pawan Kalyan warns Bhimavaram YCP MLA

  • మత్స్యపురి సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు
  • జనసేన గెలుపును ఓర్వలేకపోతున్నారన్న పవన్
  • తనను వ్యక్తిగతంగా దూషించాడంటూ భీమవరం ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు
  • ఆకురౌడీ అంటూ విమర్శలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి పంచాయతీలో జనసేన సర్పంచ్ పదవి కైవసం చేసుకుంది. అయితే సర్పంచ్ ర్యాలీ సందర్భంగా జనసేన, వైసీపీ మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మత్స్యపురిలో జనసేన విజయాన్ని భరించలేని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మత్స్యపురి గ్రామపంచాయతీలో కారేపల్లి శాంతిప్రియ అనే మహిళ సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారని, విజయం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి దండ వేయగా, ఆ దండను వైసీపీ వాళ్లు తొలగించి ఆమెను దుర్భాషలాడారని, ఆమె ఇంటిపైనా దాడి చేశారని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా అనంతలక్ష్మి అనే మత్స్యకార మహిళ ఇంటిపైనా దాడులు చేశారని తెలిపారు. వైసీపీకి చెందిన (151) ఎమ్మెల్యేలంతా ఎదుటివాళ్లను హింసించడంపైనే దృష్టి పెడుతున్నారని, వారి డీఎన్ఏ అలా ఉందని వ్యాఖ్యానించారు.

స్థానిక ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడుతున్నాడు, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తున్నాడు అని పవన్ విమర్శించారు. వారి పీఠం కదులుతుండడంతో కలిగిన భయం వల్లే వైసీపీ నేతలు ఈ విధమైన బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ అని, కోపరేటివ్ బ్యాంకులో సొమ్ముదాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్యే అని ఆరోపించారు. ఇలాంటివాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని ఆశించలేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని పవన్ స్పష్టం చేశారు.

"ఓ ప్రజాప్రతినిధిగా మీ పరిధిలో మీరు ఉండండి. మీ పరిధి దాటి, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎలా ఎదుర్కొవాలో మాకు బలంగా తెలుసును. మా వాళ్ల తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటాం. అంతేతప్ప ఇళ్లపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నందున డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డుకట్ట వేయించాలి. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత మాది కాదు" అని పవన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News