Tamilnadu: ఎన్నికల ముందు వరాలా?... తమిళనాడు సీఎం పళనిస్వామిపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- వరాల జల్లు కురిపించిన సీఎం పళనిస్వామి
- డ్వాక్రా రుణాలు, సహకార బ్యాంకుల్లో రైతు రుణాలు మాఫీ
- వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు
- ఇది మంచి పద్ధతికాదన్న సీపీఐ నారాయణ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయంగా వేడి మరింత పెరిగింది. తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మార్చి 12న నోటిఫికేషన్ రానుండగా, సీఎం పళనిస్వామి ఒక్కసారిగా వరాల జల్లు కురిపించారు. సహకార బ్యాంకుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు, 6 సవర్ల బంగారంపై రుణామాఫీ చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు, వన్నియార్ కులానికి 10.5 శాతం రిజర్వేషన్లు కూడా ప్రకటించారు.
దీనిపై సీపీఐ అగ్రనేత నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇలా వరాలు కురిపించడం సరికాదని హితవు పలికారు. తమిళనాడు, పుదుచ్చేరిలో రాజకీయం కోసం ద్రవిడ సంస్కృతిని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా నారాయణ... తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జి కిషన్ రెడ్డిపైనా వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన మంచిది కాదని వాదించే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.... అంబానీ, అదానీ కుటుంబాలను కేంద్రం పోషించడంపై మాట్లాడడంలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం కన్నతల్లిని అమ్ముకోవడంతో సమానం అని అన్నారు.