Russia: కిమ్ ఆంక్షలతో రైలు పట్టాలపై రష్యా దౌత్యవేత్తల తిప్పలు!
- చైనాలో కరోనా వ్యాప్తి మొదలు
- కఠినచర్యలు తీసుకున్న ఉత్తర కొరియా
- సరిహద్దులు మూసేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు
- ఉత్తర కొరియాలో చిక్కుకుపోయిన రష్యా దౌత్యవేత్తలు
- ఎట్టకేలకు రష్యా చేరుకున్న వైనం
చైనాలో కరోనా మహమ్మారి ఉనికి వెల్లడయ్యాక పొరుగునే ఉన్న ఉత్తర కొరియా వెంటనే అప్రమత్తమైంది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కఠిన ఆంక్షలు విధించారు. సరిహద్దులు మూసేయడమే కాకుండా, ఇతర దేశాలతో సంబంధాలు నిలిపివేశారు. దాంతో అనేకమంది విదేశీయులు స్వదేశాలకు వెళ్లే మార్గం లేక ఉత్తర కొరియాలోనే చిక్కుకుపోయారు. వారిలో రష్యాకు చెందిన పలువురు దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. ఎట్టకేలకు ఆ రష్యా దౌత్యవేత్తలు తమ కుటుంబాలతో రష్యా చేరుకున్నారు. అయితే, వారు తమ సొంతగడ్డ చేరుకోవడానికి రైలు పట్టాలపై ట్రాలీలను స్వయంగా తోసుకుంటూ రావాల్సి వచ్చింది.
ఉత్తర కొరియాలోని వివిధ ప్రాంతాల నుంచి వారు దాదాపు ఒకటిన్నర రోజు ప్రయాణం చేసి ఉత్తర కొరియా-రష్యా సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. అయితే, రష్యాలో ప్రవేశించేందుకు ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రజారవాణా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో వారు రైల్వే ట్రాలీలపై తమ లగేజిని, తమ చిన్నారులను ఉంచి, ఆ ట్రాలీలను తోసుకుంటూ ఓ కిలోమీటరు ప్రయాణించి సరిహద్దులు దాటారు. చివరి రష్యా భూభాగంలోకి ప్రవేశించి హర్షం వ్యక్తం చేశారు. కాగా, వారికి రష్యా విదేశాంగ శాఖ స్వాగతం పలికింది. వారిని బస్సులో వ్లాదివోస్తోక్ ఎయిర్ పోర్టుకు తరలించి, అక్కడ్నించి మాస్కో చేర్చారు.