Adimulapu Suresh: 8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పై శిక్షణ: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
- తిరుపతి ఐఐటీలో ఉన్నత విద్యామండలి సమావేశం
- హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
- పూర్తిగా ఆన్ లైన్ క్లాసుల కోసం సరికొత్త సాంకేతికత
- ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ వర్సిటీ ఏర్పాటు
- వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లోనూ ఆన్ లైన్ ప్రవేశాలు
తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో నిర్వహించిన ఉన్నత విద్యామండలి సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 100 శాతం ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు ఉపకరించే సాంకేతికత అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఉన్నత విద్యామండలి సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పై తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా ప్రవేశం కల్పించామని మంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లోనూ ఆన్ లైన్ ప్రవేశాలు చేపడతామని తెలిపారు.