Corona Virus: ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 250కే కరోనా టీకా... ధర పెంచేందుకు వీల్లేదని కేంద్రం ఆదేశం!
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమే
- ఎక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలన్న విషయం లబ్దిదారుల ఇష్టమే
- దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ఆసుపత్రులకు అనుమతి
ప్రైవేటు హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ ధర ఒక్కో డోస్ కు రూ. 250కి మించరాదని ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే టీకా ఉచితమేనని స్పష్టం చేసింది. సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి టీకాను ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. తాము ఎక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలన్న విషయాన్ని లబ్దిదారులే నిర్ణయించుకోవచ్చని కూడా పేర్కొంది.
ప్రభుత్వం అందుబాటులో ఉంచిన కోవిన్ 2.0, ఆరోగ్య సేతు యాప్ ల ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని, లేదా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి కూడా టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. 60 ఏళ్లు దాటిన వారు తమ వయసు గుర్తింపు ధ్రువపత్రం చూపితే సరిపోతుందని, దీర్ఘకాల రోగాలున్న వారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి సర్టిఫికెట్ తేవాల్సి వుంటుందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించామని, ఈ కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైపోయిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇండియాలో 135 కోట్ల మందికి పైగా జనాభా ఉండగా, ఆగస్టు నాటికి కనీసం 30 కోట్ల మందికి టీకాను అందించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని తెలియజేశారు.