Pawan Kalyan: ఉత్తరాది మల్లయోధులకు పవన్ కల్యాణ్ సన్మానం... వీడియో ఇదిగో!
- హర్యానా, ఉత్తరప్రదేశ్ మల్లయోధులను ఆహ్వానించిన పవన్
- శాలువాలు కప్పి, జ్ఞాపికలు బహూకరణ
- యుద్ధ విద్యలపై తన అభిమానం చాటుకున్న జనసేనాని
- ప్రాచీన భారత పోరాట యుద్ధలను ప్రోత్సహించాలని పిలుపు
మార్షల్ ఆర్ట్స్ అంటే జనసేనాని పవన్ కల్యాణ్ కు ఎంత మక్కువో తెలియంది కాదు. ఆయన తన చిత్రాల్లో ఏదో ఒక పోరాట విద్యను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మల్లయుద్ధ యోధులను హైదరాబాద్ ఆహ్వానించిన పవన్ వారిని ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ యుద్ధ విద్యలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
చిన్నప్పుడు తాను చీరాలలో ఉండే సమయంలో తండ్రితో కలిసి కుస్తీ పోటీలు చూడ్డానికి వెళ్లేవాడ్నని, నేర్చుకోవాలన్న తపన ఉన్నా శారీరక దారుఢ్యం తక్కువ కావడంతో నేర్చుకోలేకపోయానని వెల్లడించారు. ఆ సమయంలోనే ప్రముఖ వస్తాదు కోడి రామ్మూర్తి అంటే అభిమానం కలిగిందని అన్నారు. ఆయనలా తయారవ్వాలని అనుకునేవాడ్నని, అయితే బాల్యంలో తనకు ఉబ్బసం ఉండడంతో వీలుకాలేదని పవన్ వివరించారు.
తర్వాత కాలంలో తాను కరాటే, ఇస్ క్రీమా, వూషూ వంటి పోరాట విద్యలను నేర్చుకున్నానని, అయితే భారత ప్రాచీన యుద్ధ విద్యలంటే తనకు ఎంతో అభిమానమని, వాటిని భావితరాలకు అందించాలని అన్నారు. ఇది గురుశిష్య పరంపరతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బలమైన మెదడుతో పాటు బలమైన శరీరం కూడా అవసరమేనని పవన్ స్పష్టం చేశారు.