Narendra Modi: పీఎస్ఎల్వీ-సీ51 సక్సెస్‌పై ప్రముఖుల స్పందన.. బ్రెజిల్ ప్రధానికి మోదీ అభినందనలు
- మరిన్ని విజయాలు అందుకోవాలి: వెంకయ్య
- ఇస్రోకు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు అభినందనలు: మోదీ
- ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
పీఎస్ఎల్వీ-సీ51 ఈ రోజు నింగిలోకి దూసుకెళ్లి, బ్రెజిల్ కు చెందిన అమోజోనియా శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
బ్రెజిల్ ప్రధాని బోల్సోనారోకి భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ఆయన ట్వీట్ చేశారు. అలాగే, ఇస్రోకు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కూడా మోదీ అభినందనలు తెలిపారు.
శ్రీహరికోట నుంచి ఇస్రో మరో విజయాన్ని సాధించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలతో కొత్త శకానికి భారత్ నాంది పలికిన విషయానికి చిహ్నంగా ఈ విజయం నిలుస్తుందని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
'నింగిని శాసించే స్థాయికి ఎదుగుతున్న మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలకు అభినందనలు. పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వడం, విజయానికి ఇస్రో ట్రేడ్ మార్క్ లా మారడం దేశానికే గర్వకారణం' అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.