Rahul Gandhi: బ్రిటీష్ వాళ్లనే తరిమికొట్టాం... మోదీని కూడా ఓడిస్తాం: రాహుల్ గాంధీ 

Rahul Gandhi says we will beat Modi

  • తిరునల్వేలిలో విద్యావేత్తలతో సమావేశం
  • మోదీ అజేయుడేమీ కాదని వెల్లడి
  • బ్రిటీష్ వాళ్లు ఇంతకంటే శక్తిమంతులని వివరణ
  • ప్రజలు వాళ్లను పారద్రోలారని వ్యాఖ్యలు
  • మోదీని నాగ్ పూర్ తిప్పి పంపుతారని స్పష్టీకరణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తిరునల్వేలిలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యావేత్తలతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో పెద్ద శత్రువునే ఓడించామని అన్నారు. బ్రిటీష్ వాళ్లనే దేశం నుంచి తరిమికొట్టామని, మోదీని కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం ధనబలంతో తులతూగుతూ విపక్షాలను కాలరాస్తున్న బలవంతుడైన శత్రువుతో పోరాడుతున్నాం. అయితే ఇలాంటి శత్రువును గతంలో ఓడించాం. ఇంతకంటే దృఢమైన శత్రువునే మట్టికరిపించాం. 70 ఏళ్ల కిందట బ్రిటీష్ వాళ్లు ఎంతో శక్తిమంతులుగా ఉన్నారు. ఈ మోదీ అంతటి శక్తిమంతుడు అవుతాడో లేదో తెలియదు కానీ అజేయుడేమీ కాదు. భారతదేశ ప్రజలు బ్రిటీష్ వాళ్లనే వెనక్కి పంపారు. ఇప్పుడదే రీతిలో ఈయనను నాగ్ పూర్ పంపుతాం. ఎలాంటి మత విద్వేషాలు, ఆవేశాలు, హింస లేకుండానే ఈ పనిచేయగలం. అయితే, వారు మనపై చేసే దాష్టీకాలను మనం చేయబోం" అని వివరించారు.

ఇదిలావుంచితే, ఇటీవల రాహుల్ గాంధీ అరేబియా సముద్రంలో డైవింగ్ చేయడాన్ని చిత్రీకరించిన వీడియో బ్లాగర్ సెబిన్ సిరియక్ మీడియాతో మాట్లాడాడు. రాహుల్ అలా సముద్రంలోకి దూకుతారని ఎవరూ ఊహించలేదని వెల్లడించాడు. తన మాస్కును, ఫోన్ ను పక్కనే ఉన్న మత్స్యకారుడికి ఇచ్చి దూకేశారని వివరించాడు. ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప లైఫ్ గార్డ్ లేకుండా, ఎవరి సాయం తీసుకోకుండా ఈ విధంగా దూకలేరని రాహుల్ కు కితాబిచ్చాడు. కాగా, ఈ సందర్భంగా తడిసిన దుస్తుల్లో రాహుల్ కండలు బయటపడడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News