Narendra Modi: వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత నర్సుతో మోదీ ఏమన్నారంటే..?
- ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సిన్ వేయించుకున్న మోదీ
- మోదీకి వ్యాక్సిన్ వేసిన నర్సు నివేద
- ప్రధాని వస్తున్నారని తనకు ఉదయం చెప్పారన్న నర్సు
ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న 45 ఏళ్లు దాటిన వారికి దేశ వ్యాప్తంగా ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మోదీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ ను ఆయనకు వేశారు. కేరళకు చెందిన రోసమ్మ అనిల్, పుదుచ్చేరికి చెందిన పి.నివేద అనే నర్సులు మోదీకి వ్యాక్సిన్ వేయడంలో పాలుపంచుకున్నారు. నివేద ఆయనకు వ్యాక్సిన్ వేశారు.
మోదీకి వ్యాక్సిన్ వేసినప్పుడు ఆయన ఏం అన్నారనే విషయాన్ని నర్సు నివేద వెల్లడించారు. 'వ్యాక్సిన్ వేయడం అయిపోయిందా? నాకు వేసినట్టు కూడా అనిపించలేదు' అని ప్రధాని అన్నారని ఆమె తెలిపారు. నివేద మూడేళ్లుగా ఎయిమ్స్ లో పని చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మోదీ వస్తున్నారనే విషయం ఈ ఉదయమే ఆమెకు తెలిసింది.
తనకు వ్యాక్సిన్ సెంటర్ లో డ్యూటీ వేశారని... మోదీ సార్ వస్తున్నారనే విషయాన్ని తనకు ఉదయం తెలియజేశారని నివేద చెప్పారు. మోదీ సార్ ని కలవడం తనకు ఎంతో గొప్పగా ఉందని అన్నారు. 28 రోజుల్లో మోదీ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తాము ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని ప్రధాని అడిగి తెలుసుకున్నారని అన్నారు.