Andhra Pradesh: వాలంటీర్లకు సంబంధించి ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
- మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకోవద్దంటూ ఎస్ఈసీ ఆదేశాలు
- వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
- హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన ప్రభుత్వం
ఈ నెల 10న ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పని చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం, నిమ్మగడ్డ కీలక ఆదేశాలను జారీ చేశారు.
ఈ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించుకోరాదని ఆయన ఆదేశించారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల చేత ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేయించవద్దని చెప్పారు.
నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మధ్యాహ్నం పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది.