Police: రోడ్లపై బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్న అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇటీవలే ఏపీలోనూ బలవంతపు వసూళ్లు
- గుంటూరు-ప్రత్తిపాడు రోడ్డుపై వసూళ్లు
- తాజాగా తెలంగాణలో ప్రత్యక్షమైన అమ్మాయిలు
- ఘట్ కేసర్ వద్ద వరంగల్ రోడ్డుపై దందా
- కేసు నమోదు చేసిన పోలీసులు
కొన్నిరోజుల కిందట ఏపీలో గుంటూరు-ప్రత్తిపాడు రోడ్డుపై ఆధునిక వేషధారణలో ఉన్న కొందరు అమ్మాయిలు వాహనదారులను ఆపి బలవంతంగా విరాళాలు వసూలు చేయడం మీడియాలో దర్శనమిచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఓ అమ్మాయిల బృందం ప్రత్యక్షమైంది. జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు ధరించిన అమ్మాయిలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద వరంగల్ రోడ్డుపై వాహనాలను ఆపుతూ కనిపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ అమ్మాయిలు పలు బృందాలుగా ఏర్పడి హైవేలపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. స్వచ్ఛంద సేవాసంస్థల ముసుగులో ఈ దందా చేపట్టారని, వీరు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారని వివరించారు. డబ్బులు ఇవ్వని వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసమే ఈ అవతారం ఎత్తారని వెల్లడించారు.