Nagarjuna: క్రాక్, ఉప్పెన ఘనవిజయం సాధించడంతో నెట్ ఫ్లిక్స్ తో డీల్ వద్దనుకున్నాం: నాగార్జున

Nagarjuna says about Netflix deal for Wild Dog movie

  • ఇటీవల పూర్తిసామర్థ్యంతో థియేటర్లలో ప్రదర్శన
  • థియేటర్లలో విడుదలైన క్రాక్, ఉప్పెన
  • బాక్సాఫీసు వద్ద ఘనవిజయం
  • వైల్డ్ డాగ్ చిత్రాన్ని కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తామన్న నాగ్
  • క్రాక్, ఉప్పెన చిత్రాలతో నమ్మకం కలిగిందని వెల్లడి

కరోనా లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక ఇటీవలే థియేటర్లు పూర్తి సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదల కాగా, ఈమధ్య కాలంలో క్రాక్, ఉప్పెన వంటి చిత్రాలు థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపించాయి. కరోనా దెబ్బకు స్తంభించిన సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున స్పందించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'వైల్డ్ డాగ్'ను మొదట నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం వద్దనుకుని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనిపై నాగ్ వివరణ ఇస్తూ... వైల్డ్ డాగ్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని గత నవంబరులో అనుకున్నామని వెల్లడించారు. అయితే, క్రాక్, ఉప్పెన చిత్రాలు థియేటర్లలో విడుదలై బ్రహ్మాండంగా ప్రజాదరణ పొందిన తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నామని వివరించారు. ఆ రెండు సినిమాల విజయం తమలో నమ్మకం కలిగించిందని, అందుకే వైల్డ్ డాగ్ చిత్రాన్ని కూడా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. వైల్డ్ డాగ్ చిత్రం ఓటీటీ సినిమా ఎంతమాత్రం కాదని, తమ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేస్తున్నామని నాగ్ స్పష్టం చేశారు.

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న వైల్డ్ డాగ్ చిత్రంలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్ నటించారు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తారు.

  • Loading...

More Telugu News