Somu Veerraju: సీతమ్మ తల్లి పాదముద్రలున్న పవిత్ర స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు... అంతా జగన్ చలవ: సోము వీర్రాజు
- గుంటూరు జిల్లా ఎడ్లపాడులో అక్రమ నిర్మాణాలు
- జగన్ ప్రభుత్వ మద్దతు ఉందని వీర్రాజు ఆరోపణ
- మతమార్పిడి మాఫియా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు
- అక్రమంగా సిలువను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణ
- రాష్ట్రంలో హిందువులకు స్థానం లేకుండా పోతోందని ఆవేదన
గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలున్న ప్రదేశాన్ని హిందువులు పవిత్రమైన స్థలంగా భావిస్తారు. అయితే ఇప్పుడక్కడ ఓ భారీ సిలువను ప్రతిష్టాపన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలను పంచుకున్న బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి ప్రతిమలు ఉన్న చోట ఓ భారీ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ మద్దతుతోనే ఈ తంతు నడుస్తోందని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలపై తాము గతంలో ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా, ప్రభుత్వం హిందువులకు బాసటగా నిలిచే సూచనలు కనిపించలేదని అన్నారు.
అటు, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశాన్ని మతమార్పిడి మాఫియా ఆక్రమంచిందని పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో అక్రమంగా సిలువను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జగన్ పాలనలో హిందువులకు ఏపీలో స్థానం లేకుండా పోతోందని విమర్శించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ సైతం మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో క్రైస్తవ మాఫియాలు రెచ్చిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై తాము నిరసనలు తెలుపుతున్నా, ప్రభుత్వం మాత్రం ఆక్రమణదారులకే మద్దతు పలుకుతోందని ఆరోపించారు.