India: ఇండియాలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందన్న కేంద్రం!
- 5.11 శాతంగా ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు
- 2 శాతానికి దిగువన యాక్టివ్ కేసులు
- అయినా జాగ్రత్తగా ఉండాలన్న ఆరోగ్య శాఖ
ప్రస్తుతం ఇండియాలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేస్ పాజిటివిటీ రేటు 5.11 శాతానికి పడిపోవడమే దీనికి నిదర్శనమని ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, రోజులో 10 లక్షల నమూనాలను పరీక్షిస్తే, అందులో ఐదు శాతం లేదా అంతకన్నా దిగువన పాజిటివిటీ రేటు ఉంటే, వైరస్ నియంత్రణలోనే ఉన్నట్టని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ ఆ స్థాయికి అత్యంత సమీపంలోనే ఉందని వెల్లడించారు.
దేశంలో ఇప్పటికే ప్రతి పది లక్షల మందిలో 1,57,684 మందికి కరోనా టెస్ట్ నిర్వహించామని, 113 మంది కన్నుమూశారని ఆయన అన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తిని అనునిత్యం సమీక్షిస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించిన ఆయన, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 2 శాతం కన్నా లోపుగానే ఉందని, 97 శాతం మంది రికవరీ అయ్యారని తెలిపారు.
తమిళనాడు, పంజాబ్, హర్యానా వంటి కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపామని, మొత్తం నమోదవుతున్న కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర, కేరళలోనే వస్తున్నాయని రాజేశ్ భూషణ్ తెలియజేశారు. మహమ్మారి నియంత్రణలో ఉందని భావించి, తేలికగా తీసుకోరాదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా ముగిసేంత వరకూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్ద పార్టీలకు, భారీ ఎత్తున ప్రజలు ఒక చోటకు చేరే సభలు తదితరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని కోరారు.