Sourav Ganguly: ప్రధాని సభకు గంగూలీ వస్తానంటే స్వాగతిస్తాం: బీజేపీ
- ఆరోగ్యం సహకరిస్తే రావొచ్చన్న శమిక్ భట్టాచార్య
- తుది నిర్ణయం గంగూలీదేనని వెల్లడి
- ఆయనొస్తే అందరికీ ఇష్టమేనని కామెంట్
- దీనిపై స్పందించని బీసీసీఐ అధ్యక్షుడు
కోల్ కతాలో మార్చి 7న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరవుతారన్న ఊహాగానాలపై బీజేపీ స్పందించింది. సభకు రావడం, రాకపోవడం గంగూలీ ఇష్టమని, ఆ నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తున్నామని పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి శమిక్ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్యం సహకరించి, వాతావరణమూ అనుకూలించి గంగూలీ సభకు వస్తానంటే స్వాగతిస్తామని అన్నారు. సౌరవ్ ఆరోగ్యం బాగాలేదన్న విషయం తమకు తెలుసని, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ ఆయన మోదీ సభకు హాజరు కావాలనుకుంటే తప్పకుండా రావొచ్చని అన్నారు. గంగూలీ వస్తే ఆయనతో పాటు తమకు, సభకు వచ్చే జనాలకు ఇష్టమేనని అన్నారు. అయితే, ఇప్పుడే ఈ విషయంపై తామేమీ చెప్పలేమని, నిర్ణయం గంగూలీదేనని శమిక్ పేర్కొన్నారు.
కాగా, ఈ విషయంపై గంగూలీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారన్న ఊహాగానాలూ భారీగానే వినిపిస్తున్నాయి. గంగూలీకి గుండెపోటు రావడంతో జనవరి 27న రెండు స్టెంట్లు వేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.