Sasikala: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ సంచలన ప్రకటన
- ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ
- మరికొన్ని వారాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- ప్రకటన విడుదల చేసిన చిన్నమ్మ
- తానెప్పుడూ అధికారం, పదవులు కోరుకోలేదని వెల్లడి
- జయ పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నట్టు వివరణ
ఇటీవలే జైలు నుంచి విడుదలైన శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను అందలం ఎక్కించేందుకు కృషి చేస్తారని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు.
"నేనెప్పుడూ అధికారంలో లేను. జయ బతికున్నప్పుడు కూడా నేను ఎలాంటి పదవుల్లో లేను. ఆమె చనిపోయిన తర్వాత కూడా అధికారం చేపట్టాలని, పదవిని అధిష్ఠించాలని కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఆమె పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె ఘనమైన వారసత్వం కొనసాగాలని ఆశిస్తున్నాను" అంటూ శశికళ తన లేఖలో పేర్కొన్నారు.
అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ, విడుదలయ్యే సమయంలోనూ శశికళ రాజకీయ భవితవ్యంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఆమె మళ్లీ అన్నాడీఎంకే పగ్గాలు చేపడతారని, ఎన్నికల్లో పార్టీని తిరుగులేని విధంగా నడిపిస్తారని భావించారు. అయితే, ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న నేపథ్యంలో చిన్నమ్మ అస్త్రసన్యాసం అన్నాడీఎంకే నేతలకు మింగుడుపడడంలేదు.