India: నేటి నుంచి చివరి టెస్ట్... ఓడిపోకుంటే లార్డ్స్ లో టెస్ట్ చాంపియన్ షిప్!
- కనీసం డ్రా చేసుకున్నా టెస్ట్ చాంపియన్ షిప్ కు ఇండియా
- స్పిన్ పిచ్ నే తయారు చేసినట్టు వార్తలు
- ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి నుంచి అత్యంత కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఓటమి పాలుకాకుంటే చాలు... భారత జట్టు లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధిస్తుంది. అంటే విజయం సాధించినా, డ్రా చేసుకున్నా భారత్ కు అవకాశాలు ఉంటాయి. ఇక ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
కాగా, నాలుగో టెస్ట్ కు కూడా స్పిన్ పిచ్ నే తయారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, నిలదొక్కుకుని ఆడితే పరుగులు సాధించడం కష్టమేమీ కాదని క్యూరేటర్ వర్గాలు అంటున్నాయి. ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలని భారత్ భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ లతో పాటు ఉమేశ్ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ మ్యాచ్ నేటి ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.