David Warner: ఇంతకు ముందు ఎన్నడూ ఇంతటి నొప్పిని అనుభవించలేదు: డేవిడ్ వార్నర్
- భారత్తో చివరి రెండు మ్యాచులు ఆడకపోయి వుంటే బాగుండేది
- గాయం నుంచి కోలుకోకముందే ఆడాను
- ఆడడం వల్ల గాయం తీవ్రత పెరిగింది
- ఆస్ట్రేలియా జట్టుకు సాయం చేయాలనే ఆడాను
గాయంతో బాధపడుతూ పూర్తిగా కోలుకోకముందే భారత్తో టెస్టు మ్యాచులు ఆడినందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ బాధపడిపోతున్నాడు. అలా ఆడడంతో గాయం వల్ల ప్రతికూల ప్రభావాల తీవ్రత మరింత పెరుగుతోందని చెప్పాడు.
కొన్ని రోజు ముందు ఆస్ట్రేలియా-భారత్ మధ్య సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. అయినప్పటికీ, దాని నుంచి పూర్తిగా కోలుకోకముందే చివరి రెండు టెస్టుల్లో ఆయన ఆడాడు. వాటిల్లో రాణించలేకపోయాడు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా జట్టుకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను రెండు టెస్టు మ్యాచులు ఆడానని చెప్పాడు. అయితే, అలా చేయకపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని తెలిపాడు.
గాయంతోనే మ్యాచులు ఆడడంతో దాని తీవ్రత మరింత పెరుగుతుందని, దాని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతోందని తెలిపాడు. తాను కేవలం తన గురించి ఆలోచించి ఉంటే ఆ మ్యాచులు ఆడకపోయేవాడినని, జట్టుకు సాయం చేయాలనే ఆడానని చెప్పుకొచ్చాడు. తన ఉదరం, గజ్జల్లో బాగా నొప్పి వస్తోందని, ఇంతకు ముందు ఎన్నడూ ఇంతటి నొప్పిని తాను అనుభవించలేదని చెప్పాడు.