Suvendu Adhikari: అక్కడి నుంచి పోటీ చేయకపోయినా.. మమతను ఓడించేందుకు కృషి చేస్తా: సువేందు అధికారి

Even if I dont contest Nandigram will ensure Mamata Banerjees defeat says Suvendu Adhikari
  • నందిగ్రామ్ లో మమతను ఓడించడం తన బాధ్యతని కామెంట్
  • తృణమూల్ అధినాయకత్వంపై సువేందు తండ్రి, ఆ పార్టీ ఎంపీ శిశిర్ మండిపాటు
  • పార్టీ తనను పట్టించుకోవట్లేదని ఆరోపణ
  • ఎవరూ తనతో మాట్లాడడం లేదని వ్యాఖ్య
  • ఖండించిన తృణమూల్ సెక్రటరీ జనరల్
  • ఆయన ఆత్మ, దేహం వేర్వేరు చోట్ల ఉన్నాయని మండిపాటు
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ తనకు నందిగ్రామ్ లో పోటీ చేసే అవకాశం రాకపోయినా, ఆమెను ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తానన్నారు.

‘‘పార్టీ నాకు నందిగ్రామ్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. అక్కడ మమత ఓటమికి కృషి చేస్తా. అది నా బాధ్యత’’ అని ఆయన అన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కొన్నేళ్లుగా నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లోనూ అక్కడి నుంచే బరిలోకి దిగుతానని కొన్ని రోజుల క్రితం చెప్పారు. అంతేకాదు.. మమతను ఓడిస్తానని, ధైర్యం ఉంటే అక్కడి నుంచి పోటీ చేయాలని మమతకూ సవాల్ విసిరారు.

కాగా, సువేందు అధికారి తండ్రి, తృణమూల్ ఎంపీ శిశిర్ అధికారి.. పార్టీ అధినాయకత్వంపై మండిపడ్డారు. పార్టీ నేతలు అసలు తనను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎవరూ తనతో మాట్లాడట్లేదని అన్నారు. ఎవరైనా తనతో మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పార్టీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఆయన కుమారులు సువేందు అధికారి, సౌమేందు అధికారి బీజేపీలో చేరినప్పటి నుంచి శిశిర్ అధికారి.. మమత కార్యక్రమాలు వేటికీ హాజరు కావడం లేదు.

అయితే, ఆయన ఆరోపణలను పార్టీ సెక్రటరీ జనరల్ పార్థా ఛటర్జీ ఖండించారు. శిశిర్ వృద్ధుడయ్యారని, ఆయన ఆత్మ, దేహం వేర్వేరు చోట్ల ఉన్నాయని అన్నారు. ముందు ఆయన ఆ సంగతి చూసుకుంటే మంచిదన్నారు. ఆయన ఎటవైపు చూస్తున్నారో ఈ మాటలతో అర్థమవుతుందన్నారు.
Suvendu Adhikari
Trinamool
West Bengal
Mamata Banerjee
Shishir Adhikari
BJP

More Telugu News