Andhra Pradesh: కైక‌లూరులో వైసీపీ, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మధ్య ఘర్షణ

  • బంద్‌లో పాల్గొన్న నేత‌లు
  • ఫ్లెక్సీ విష‌యంలో గొడ‌వ‌
  • స‌ముదాయించిన పోలీసులు
  • ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. అయితే, ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా కైకలూరులో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య‌ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.

అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీకి చెందిన‌ ప్లెక్సీ ఏర్పాటు చేయ‌డంపై ఆ రెండు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. టీడీపీ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైసీపీ కార్యకర్తలు చించి వేయ‌డంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

పోలీసులు జోక్యం చేసుకుని వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. వైసీపీ తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణతో పాటు టీడీపీ కార్యకర్తలు రహదారిపై బైఠాయించారు. మ‌రోవైపు, ఏపీలోని అన్ని విద్యాసంస్థలు ఈ రోజు తెరుచుకోలేదు.

అలాగే, లారీ యజమానుల సంఘాలు, ప్రజా, మహిళా సంఘాలు బంద్‌కు మద్దతు ప్ర‌క‌టించాయి. విశాఖ‌లో కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు నిరసన చేపట్టారు.  తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో ప‌లు రాజ‌కీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు, ప్ర‌జా సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి. కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు బంద్ కు మ‌ద్ద‌తు తెలిపారు.

విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల నేత‌లు నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు.

  • Loading...

More Telugu News