Indian Railways: రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలను ఒకేసారి రూ.30కి పెంచిన రైల్వే శాఖ
- ప్లాట్‌ఫాం టికెట్ ధర ఇప్పటివరకు రూ.10
- రూ.20 పెంచుతూ నిర్ణయం
- పెంచిన ధరలు వెంటనే అమల్లోకి
- లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30
దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ టికెట్ ధర రూ.10గా ఉంది. రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధరను రూ.30గా నిర్ణయించింది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అన్ని జోన్లనూ ఆదేశించింది. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండవచ్చు.
మరోవైపు, లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోన్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేయడానికి చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫాంపై ఎక్కువ మందిని ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.