Pamphlet: సజ్జల విడుదల చేసిన కరపత్రంపై బహిరంగ చర్చకు సిద్ధం: అశోక్ బాబు
- రాష్ట్ర ప్రభుత్వంపై అశోక్ బాబు ధ్వజం
- నాడు-నేడు పేరుతో ప్రమాణాలు దిగజార్చారని విమర్శలు
- భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని వ్యాఖ్య
- సజ్జల కరపత్రంలో అన్నీ అబద్ధాలేనని ఆరోపణ
- అందుకే సజ్జలను సలహాదారుగా పెట్టుకున్నారని ఎద్దేవా
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వైసీపీ సర్కారుపైన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు-నేడు పేరుతో పాఠశాలల రంగులు మార్చి విద్యాప్రమాణాలు దిగజార్చారని వ్యాఖ్యానించారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా పాఠశాలల్లో ప్రమాణాలు ఎలా పెంచాలన్నదాని గురించి ఆలోచిస్తాడని, విద్యావేత్తలతో, మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కానీ అదేమీ లేకుండా... ఎన్ఆర్జీఎస్ నిధులతో సున్నాలు వేయండి, కాంపౌండ్ వాల్స్ కట్టండి, సింగిల్ టెండర్లో ఫర్నిచర్ కొనండి, టీవీలు కొనండి... ఏమాత్రం అనుభవం లేని సాంకేతిక అంశాలను టీచర్లపై రుద్దండి అంటూ భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు.
ఇసుక మాఫియాకు తెరలేపి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల ఓ కరపత్రం విడుదల చేశారని, అందులో అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. ఈ విధమైన అబద్ధాలు బాగా చెబుతారనే సజ్జలను సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించి ఉంటారని ఎద్దేవా చేశారు. మంచి చేసిన ప్రభుత్వానికే ఓటేయాలని కరపత్రంలో సజ్జల చెప్పారని, 30 మంది ప్రభుత్వ సలహాదారులకు తప్ప ఎవరికీ మంచి జరగలేదని అశోక్ బాబు అన్నారు. సజ్జల విడుదల చేసిన కరపత్రంపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
మద్యం అంశాన్ని ఓ ఆదాయ వనరుగానే కరపత్రంలో పేర్కొన్నారు తప్ప, మద్యనిషేధం దిశగా ఒక్క మాట కూడా చెప్పలేదని ఆరోపించారు. మద్యనిషేధం పేరు చెప్పి అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నారని మండిపడ్డారు. ఆబ్కారీ మంత్రి గానీ, ప్రభుత్వానికి చెందిన మరెవరైనా గానీ రాష్ట్రంలో ఏ మద్యం షాపు వద్దకు వెళ్లినా సీసాతో కొడతారని పేర్కొన్నారు.