Balakrishna: బాలయ్య చేయి చేసుకోవడంపై ఆయన అభిమాని స్పందన!
- హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాలయ్య
- బాలయ్య తనను టచ్ చేశారని సంతోషం వ్యక్తం చేసిన అభిమాని
- ఆయన అభిమానులు ఇలాంటివి పట్టించుకోరని వ్యాఖ్య
బాలయ్య తన అభిమానులను ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో వారిపై చేయి చేసుకోవడం కూడా విదితమే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం బాలయ్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో తలమునకలై ఉంటున్నారు. ఈ సందర్భంగా ఓ యువకుడిపై ఆయన చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సదరు యువకుడు స్పందించాడు.
తన పేరు సోము అని... బాలయ్యకు తాను వీరాభిమానినని అతను చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య విరామం లేకుండా శ్రమిస్తున్నారని... ప్రచారంలో భాగంగా ఆయన తమ ఇంటికి వచ్చారని... అయితే తాను ఎవరో తెలియక, బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోసేశారని తెలిపాడు. బాలయ్య విషయంలో అభిమానులుగా తాము ఇలాంటి విషయాలను పట్టించుకోమని చెప్పాడు.
ఈరోజు ప్రచారంలో బాలయ్య ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని... కానీ ఆయన తనను టచ్ చేశారని సంతోషం వ్యక్తం చేశాడు. బాలయ్య తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపాడు. ప్రత్యర్థి పార్టీలు ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించాడు. జై బాలయ్య... జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశాడు.