CPM: ప్రభుత్వ సంస్థలు, బీజేపీ.. వాటికి నచ్చినట్టు ఆడుతున్నాయి: కేరళ ముఖ్యమంత్రి
- తమ పరువు తీసేందుకే కస్టమ్స్ ఆరోపణలన్న విజయన్
- ఆ అపనిందలను ప్రజలు నమ్మరని భరోసా
- భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటేనని కామెంట్
- షెడ్యూల్ తర్వాత ప్రభుత్వ సంస్థల దాడులు పెరిగాయని ఆరోపణ
కేరళలో ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర విచారణ సంస్థలు ఆక్రమించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. బంగారం స్మగ్లింగ్ తో కేరళ సీఎంకూ సంబంధం ఉందంటూ కేరళ హైకోర్టులో కస్టమ్స్ అధికారులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయన్ స్పందించారు.
‘‘వారికి నచ్చినట్టు బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆడుతున్నాయి. మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే. వాళ్లనుకుంటున్న వ్యక్తులం కాదు మేము. మీరేం చేసినా ఇక్కడి వారు మాపై అపనిందలను నమ్మరు. మా జీవితాలు తెరచిన పుస్తకాలు. అది మీరు త్వరలోనే తెలుసుకుంటారు” అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరువు, ప్రతిష్ఠలను తీసేందుకే కస్టమ్స్ కమిషనర్ ఈ ఆరోపణలు చేశారన్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కస్టమ్స్ అధికారుల హంగామానే నడుస్తోందన్నారు. షెడ్యూల్ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు పెరిగిపోయాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ సంస్థలు రాజకీయ ప్రకటనలు చేస్తున్నాయన్నారు. విపక్షాలు, బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఆయా సంస్థలు నాటకాలు ఆడుతున్నాయన్నారు.