Ravishastri: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల విధానంలో మార్పు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవిశాస్త్రి
- టెస్టుల్లో వరల్డ్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్న ఐసీసీ
- తొలుత పాయింట్ల విధానం అమలు
- మధ్యలో పాయింట్ల శాతాన్ని తీసుకువచ్చిన ఐసీసీ
- ఒకటో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిన భారత్
- అయినప్పటికీ ఇంగ్లండ్ పై విజయంతో ఫైనల్ చేరిక
ఐసీసీ ఇటీవల టెస్టుల్లోనూ వరల్డ్ చాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టెస్టు చాంపియన్ షిప్ లో తొలుత పాయింట్ల విధానం అమలు చేశారు. కానీ చాంపియన్ షిప్ సగం జరిగాక, పాయింట్ల విధానం స్థానంలో పాయింట్ల శాతాన్ని అర్హత ప్రమాణంగా నిర్ణయించారు. తాజాగా ఇంగ్లండ్ పై సిరీస్ విజయంతో భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరినప్పటికీ, కోచ్ రవిశాస్త్రి మాత్రం ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న తాము నిబంధన మార్పు కారణంగా ఒకటో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయామని వివరించారు. ఇలాంటి మార్పులు సరికాదని హితవు పలికారు. తదుపరి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ను సజావుగా చేపడతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.