mallikharjuna kharge: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ
- గత నెల ఆజాద్ పదవీ కాలం ముగింపు
- ఖర్గేకు వెంకయ్య అభినందనలు
- గొప్ప అనుభవం ఉన్న నాయకుడని కితాబు
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో తమ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీంతో ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
సభ తరపున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. దేశంలో గొప్ప అనుభవం ఉన్న నాయకులలో ఖర్గే ఒకరని వెంకయ్య కొనియాడారు. కాగా, రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేటి నుంచి నెల రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు కూడా ఉన్నాయి. త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది.