Anant Kumar Hegde: రాజకీయాలకు ముగింపుపలికే యోచనలో అనంతకుమార్ హెగ్డే
- వెన్ను, కాలి నొప్పితో బాధపడుతున్న హెగ్డే
- శస్త్ర చికిత్సను నిర్వహించిన వైద్యులు
- సుదీర్ఘకాలం పాటు విశ్రాంతిని తీసుకోవాలని సలహా
కర్ణాటక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే రాజకీయాలకు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. తీవ్రమైన వెన్ను, కాలి నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించారు.
ఈ సందర్భంగా, శరీరానికి ఎక్కువ శ్రమ కల్పించకూడదని, సుదీర్ఘకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సురేశ్ శెట్టి మాట్లాడుతూ, లోక్ సభ సమావేశాలతో పాటు కొంత కాలం పాటు ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనబోరని చెప్పారు.
అనంతకుమార్ గత కొన్నేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా ఆయన చికిత్స తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన అప్పుడే భావించారు. అయితే ఆరోగ్యం కొంత మెరుగవడంతో ఎన్నికల్లో పోటీ చేసి, గెలుపొందారు.
ఎన్నికల తర్వాత మళ్లీ చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పట్లో వెన్నునొప్పి తగ్గే అవకాశం లేదని భావిస్తున్న ఆయన... రాజకీయాలకు ముగింపు పలికే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఢిల్లీలో ఆయన కరోనా చికిత్స కూడా పొందారు. కర్ణాటక రాజకీయాల్లో అనంతకుమార్ హెగ్డేకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది.