West Bengal: బెంగాల్ కిరీటం మళ్లీ మమతదే: 'టైమ్స్ నౌ-సి ఓటర్' సర్వే
- కేరళలో బీజేపీకి ఒకే ఒక్క స్థానం
- పుదుచ్చేరి మాత్రం బీజేపీ ఖాతాలోకే
- అసోంలో హోరాహోరీ పోరు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. బెంగాల్లో దీదీని దించి అధికారంలోకి రావాలన్న కలలు బీజేపీకి కల్లలుగానే మిగిలిపోనున్నాయని టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే చెబుతోంది.
రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అధికార టీఎంసీ 154 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకుంటుందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి 107 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి 33 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే, హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో మాత్రం పశ్చిమ బెంగాల్లో బీజేపీ 160 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తేలింది.
ఇక, కేరళలోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పేలా కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు గత ఎన్నికల్లోనూ బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిపట్టుదలగా ఉంది. అయితే, ఈసారి కూడా కేరళ వామపక్ష కూటమిదేనని సర్వేలో తేలింది. ఇక్కడ మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్ 78-86 స్థానాల్లో విజయం సాధిస్తుందని, యూడీఎఫ్‌కు 52-60 మధ్య సీట్లు లభించే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. ఇక, బీజేపీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధిస్తుందని తెలిపింది.
తమిళనాడు ఎన్నికలను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీకి ఈసారీ ఇక్కడ చుక్కెదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 234 శాసనసభ స్థానాలుండగా డీఎంకే కూటమికి 158, అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 65 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ-సి ఓటర్ సర్వే అంచనా వేసింది.
అసోంలోనూ పోరు హోరాహోరీగానే సాగుతుందని అయితే, బీజేపీ మాత్రం విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలు ఉండగా, బీజేపీ-ఏజీపీలు కలిసి 67 స్థానాలను కైవసం చేసుకుంటాయని, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 57 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 18 స్థానాల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకుంటుందని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 12 వస్తాయని తెలిపింది.