Atchannaidu: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధం: అచ్చెన్నాయుడు

Atchannaidu strongly criticizes CM Jagan over Vizag Steel Plant issue

  • స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ
  • సీఎం లేఖను ఢిల్లీలో పట్టించుకునేదెవడన్న అచ్చెన్నాయుడు
  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని వ్యాఖ్యలు
  • సీఎంకు భూములే గుర్తొస్తున్నాయని విమర్శలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడం పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. సీఎం లేఖ రాయడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ అంటే ముఖ్యమంత్రికి భూములు, వాటి విలువ మాత్రమే గుర్తొస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమకు మాత్రం స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం గుర్తొస్తోందని, 32 మంది ప్రాణత్యాగం గుర్తొస్తుందని, 20 వేల ఎకరాలు ఇచ్చిన పేదల త్యాగం గుర్తొస్తోందని తెలిపారు.

ఈ ముఖ్యమంత్రి ఎంతసేపటికీ భూములు, భూములు అని మాట్లాడడం తప్ప ఇంకేం చేస్తున్నాడని అన్నారు. భూములు అమ్మి సంక్షేమ పథకాలు చేపడతానని, భూములు అమ్మి స్టీల్ ప్లాంట్ నిలబెడతానని అంటే ముఖ్యమంత్రిగా నువ్వెందుకు? అని మండిపడ్డారు. జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని, జగన్ చెప్పే ప్రతిమాట అబద్ధమేనని అచ్చెన్నాయుడు విమర్శించారు.

"కనీసం ఒక్కసారైనా అఖిలపక్షం ఏర్పాటు చేశావా? లేకపోతే ఢిల్లీ వెళ్లి అడుగుదాం అని అన్నావా? ఎంతసేపూ నీ కేసుల గురించే ఢిల్లీ వెళుతున్నావే తప్ప, ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రం పెద్దలతో నేరుగా చెప్పావా? అడిగితే లేఖ రాశాం అంటున్నారు... ఢిల్లీలో నీ లేఖ చూసేదెవరు? అయినాగానీ ఇప్పుడెవరైనా లేఖ రాస్తారా? ప్రైవేటీకరణ అంశానికి పునాది పడినప్పుడే లేఖ రాయాల్సింది. ఇప్పుడు నగరపాలక ఎన్నికలు జరుగుతుండడంతో విశాఖలో పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ నేతలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, నిన్న నిర్మల సీతారామన్ చెప్పిన జవాబుతో స్పష్టంగా వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళుతున్నామని నిర్మల తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో, కేంద్రానికి లేఖ రాశాను, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళతాను అంటే ఎవరూ నమ్మరు.

2003లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇదే పరిస్థితి వచ్చింది. వాజ్ పేయి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి ప్రైవేటీకరణకు యత్నిస్తుంటే నాడు చంద్రబాబు, ఎర్రన్నాయుడు కార్మిక సంఘాల యూనియన్లతో కలిసి గట్టిపోరాటం చేసి నిలుపుదల చేయించారు. అదీ పోరాటమంటే! మీకా సత్తా లేదా? గొర్రెల మందలా 23 మంది ఉన్నారు. ప్రయత్నిస్తే ప్రధాని అపాయింట్ మెంట్ దొరకదా? కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్లండి చాలు... మీకు మాట్లాడడం చేతకాకపోతే వాళ్లే మాట్లాడతారు. నాడు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పోరాడిన చరిత్ర టీడీపీది, మీ చరిత్ర ఏంటి?" అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

"బొత్స అంటాడూ... ఇది నిరంతర ప్రక్రియ అంట! అన్నీ నాశనం చేస్తూ.. నిరంతర ప్రక్రియ అంటున్నాడు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేం సిద్ధంగా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రైవేటీకరణ అంశం బయటికొచ్చి నెలరోజులైంది. ఏంచేశారు ఇప్పటివరకు?" అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News