Vijayasai Reddy: కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపిస్తూ ప్రైవేటీకరణ చేయడం సరికాదు: విజయసాయిరెడ్డి
- ప్లాంటును కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే
- కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
- చంద్రబాబు హయాంలోనే ప్లాంటు నష్టాల బాట పట్టింది
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ప్లాంటు ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు.
స్టీల్ ప్లాంటును లాభాల బాటలో ఎలా నడిపించాలనే విషయంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ రెండో సారి లేఖ రాశారని చెప్పారు. దీర్ఘకాల పోరాటంతో సాధించుకున్న సంస్థ వైజాగ్ స్టీల్ అని అన్నారు. ప్లాంట్ కోసం జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ మొదట్లో లాభాల్లో నడిచిందని... చంద్రబాబు హయాంలో నష్టాల బాట పట్టిందని ఆరోపించారు. సొంత ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం సంస్థ పతనానికి మరో కారణమని చెప్పారు. సొంత గనులు కేటాయిస్తే సంస్థ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం కేవలం నష్టాలను మాత్రమే చూపిస్తూ ప్రైవేటీకరణ చేయడం సరికాదని చెప్పారు.