West Bengal: పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్రను అకస్మాత్తుగా బదిలీ చేసిన ఎన్నికల సంఘం
- డీజీపీని తక్షణం తప్పించాలంటూ సీఎస్‌కు లేఖ
- ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వవద్దని ఆదేశం
- వీరేంద్ర స్థానంలో నీరజ్ నయన్ ను నియమించిన ఈసీ
పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్రను కేంద్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా బదిలీ చేసింది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న వేళ ఆయనను తక్షణం బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బంద్యోపాధ్యాయ్‌కు లేఖ రాసింది. ఆయన స్థానంలో 1987 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన పి.నీరజ్ నయన్ ను డీజీ అండ్ ఐజీపీ (అడ్మినిస్ట్రేషన్)గా నియమించింది.
రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కార్యదర్శి రాజేశ్ కుమార్ తెలిపారు. కాగా, బదిలీ చేసిన వీరేంద్రకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎన్నికలతో సంబంధం ఉన్న ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్‌కు రాసిన లేఖలో ఈసీ ఆదేశించింది.
1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీరేంద్ర మే 2018లో పశ్చిమ బెంగాల్ డీజీ అండ్ ఐజీపీగా బాధ్యతలు చేపట్టారు. డీజీపీ వీరేంద్ర అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని పలు పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే జావేద్ షామిన్‌ను ఏడీజీ (లా అండ్ ఆర్డర్) నుంచి తప్పించిన ఈసీ ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి జగ్‌మోహన్‌ను నియమించింది.