Ram Nath Kovind: శివనామ స్మరణలతో మారుమోగుతోన్న ఆలయాలు.. శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
- దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు: రాష్ట్రపతి
- సమస్యలను ఎదుర్కునే శక్తిని పరమేశ్వరుడు ఇవ్వాలి: ఉప రాష్ట్రపతి
- హరహర మహాదేవ: ప్రధాని మోదీ
- భక్తులకు శివుడి ఆశీర్వాదం ఉండాలి: కేసీఆర్
- శివుడిని ధ్యానించే పవిత్రమైన రోజిది: జగన్
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. శివనామ స్మరణలతో ఆలయప్రాంగణాలు మారుమోగుతున్నాయి. కరోనా ప్రభావంతో పలు ఆలయాల్లో నిబంధనల నడుమ భక్తులు పూజల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.
మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా అన్ని సమస్యలను ఎదుర్కునే శక్తిని పరమేశ్వరుడు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హరహర మహాదేవ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు శివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని అన్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విశేష పూజలు, జాగరణతో శివుడిని ధ్యానించే పవిత్రమైన రోజని, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించి గుడివాడ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు.