Congress: మనం చర్చించినట్టే.. విదేశాలూ చర్చిస్తాయ్: శశిథరూర్
- సాగు చట్టాలపై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చ
- అసహనం వ్యక్తం చేసిన భారత్
- తప్పేముందని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
- మనలాగే వారికీ హక్కుంటుందని కామెంట్
మన దేశంలో మనం విదేశీ అంతర్గత వ్యవహారాలను ఎలా చర్చిస్తున్నామో.. విదేశాలూ మన దేశ అంతర్గత వ్యవహారాలూ చర్చిస్తాయని, అందులో తప్పేముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సాగు చట్టాలపై బ్రిటన్ పార్లమెంట్ లో చర్చించడంపై భారత్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం బ్రిటన్ హైకమిషనర్ కు కేంద్రం సమన్లు కూడా ఇచ్చింది. దీనిపై తాజాగా శశిథరూర్ స్పందించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చని ఆయన అన్నారు. ‘‘మనం మన దేశంలో పాలస్తీనా–ఇజ్రాయెల్ అంశాన్ని మాట్లాడతాం. గతంలో మాట్లాడాం. ప్రజాస్వామ్య దేశంగా మనకు విదేశాల అంతర్గత వ్యవహారాలపై చర్చించే హక్కున్నప్పుడు.. బ్రిటన్ కూ అదే హక్కు ఉంటుంది’’ అని అన్నారు.
విదేశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించే విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తానేమీ తప్పుబట్టట్లేదని అన్నారు. అయితే, విదేశాలకూ అదే హక్కుంటుందన్న విషయాన్నీ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలుగా తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే హక్కు వారికి ఉంటుందన్నారు.