Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయం: స్వరూపానందేంద్ర స్వామి
- విశాఖ ఆర్కే బీచ్ వద్ద మహా శివరాత్రి ఉత్సవాలలో స్వామీజీలు
- తెలుగువారంతా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్య
- ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరంకానివ్వబోమని స్పష్టం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మ నందేంద్ర స్వామి కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ వద్ద టి.సుబ్బరామిరెడ్డి శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మనందేంద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వరూపానంద మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని అన్నారు. తెలుగువారంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరంకానివ్వబోమని అన్నారు.