Mamata Banerjee: దయచేసి ప్రశాంతంగా ఉండండి: ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ విన్నపం
- నిన్నటి దాడిలో గాయపడ్డ మమత
- ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపిన సీఎం
- ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని విన్నపం
అందరూ ప్రశాంతంగా ఉండాలని తన పార్టీ నేతలు, కార్యకర్తలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. నందిగ్రామ్ లో నిన్న జరిగిన దాడిలో ఆమె గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ శ్రేణులకు ఆమె వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు.
ప్రశాంతంగా ఉండాలని, నియంత్రణను పాటించాలని అందరినీ కోరుతున్నానని మమత అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. తన కాలు, మోకాలికి గాయాలు అయిన సంగతి నిజమేనని తెలిపారు. లిగమెంట్ గాయపడిందని తెలిపారు. ఛాతీ నొప్పితో బాధపడ్డానని చెప్పారు. తన కారులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా... ఓ గుంపు వచ్చిపడడంతో గాయాలయ్యాయని అన్నారు. నిన్న ఆరోపణలు చేసినట్టుగా ఎవరో దాడి చేశారని మాత్రం ఆమె ఈ రోజు పేర్కొనలేదు.
ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని... రెండు, మూడు రోజుల్లో తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. కాలి గాయం కొన్ని రోజుల పాటు బాధిస్తూనే ఉంటుందని... అయినప్పటికీ మేనేజ్ చేసుకుంటానని చెప్పారు. వీల్ ఛైర్ లో తిరుగుతానని... మీ అందరి మద్దతు తనకు కావాలని అన్నారు.