Afghanistan: 12 ఏళ్లు పైబడిన విద్యార్థినులపై ఆఫ్ఘన్ విద్యాశాఖ కీలక నిర్ణయం
- బహిరంగ కార్యక్రమాల్లో పాటలు పాడకూడదని నిషేధం
- మహిళలు మాత్రమే హాజరయ్యే కార్యక్రమాల్లో పాడేందుకు అనుమతి
- ప్రభుత్వ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ముస్లిం దేశాల్లో మహిళలు, బాలికలపై ఎన్నో ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు పైబడిన స్కూలు విద్యార్థినులు ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో పాటలు పాడకూడదని నిషేధం విధించింది.
అయితే కేవలం మహిళలు మాత్రమే హాజరయ్యే కార్యక్రమాల్లో మాత్రం పాటలు పాడొచ్చని తెలిపింది. బాలికలకు పురుష ఉపాధ్యాయులు సంగీతాన్ని నేర్పించకూడదని షరతు విధించింది. తమ ఆంక్షలు అమలయ్యేలా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం తాలిబాన్ల విధానాలను తలపిస్తోందని పలువురు మండిపడుతున్నారు.