V.V Lakshminarayana: ప్రధాని మోదీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ
- ఏ స్టీల్ ప్లాంటుకు లేని ప్రత్యేకతలు వైజాగ్ ప్లాంటుకు ఉన్నాయి
- ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు
- రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుంది
మన దేశంలో ఏ స్టీల్ ప్లాంటుకు లేని ప్రత్యేకతలు వైజాగ్ ప్లాంటుకు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. చిన్నచిన్న మార్పులతో ప్లాంటును తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
ప్లాంటును ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి కొంత కాలం తర్వాత తప్పకుండా మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఉంటుందని... అయితే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమే దానికి పరిష్కారం కాదని చెప్పారు. నిపుణుల సలహాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రానికి పంపుతామని తెలిపారు.
విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో స్టీల్ కు డిమాండ్ పెరగబోతోందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. స్టీల్ ప్లాంటులను ప్రైవేటీకరిస్తే, సిమెంటు రంగానికి పట్టిన గతే పడుతుందని... రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందని అన్నారు.
సర్దార్ పటేల్ విగ్రహానికి అవసరమైన 3,200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2,200 టన్నుల స్టీలును విశాఖ కర్మాగారం నుంచే పంపారని గుర్తుచేశారు. మిగిలిన స్టీల్ కంటే విశాఖ స్టీల్ నాణ్యమైనదని తెలిపారు. ఇతర స్టీల్ ప్లాంటులకు లేని ప్రత్యేకత వైజాగ్ స్టీల్ కు ఉందని... సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇదేనని చెప్పారు. ఎగుమతులు, దిగుమతులకు అనువైన ప్రాంతం వైజాగ్ అని అన్నారు.