KTR: విశాఖ ఉక్కుపై నోరు మూసుకుని ఉండలేం!: మరోసారి స్పందించిన కేటీఆర్

KTR comments on Visakha Steel Plant issue

  • విశాఖ ఉక్కుపై మరోసారి స్పందించిన కేటీఆర్
  • కొందరు నీకెందుకంటున్నారని వెల్లడి
  • మేం దేశంలో లేమా అంటూ ఆగ్రహం
  • మాకు నోరు లేదా అంటూ తీవ్రంగా స్పందించిన వైనం

తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు అంశంపై మరోసారి స్పందించారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారని విమర్శించారు. తాను విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందిస్తుంటే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, విశాఖ ఉక్కు సంగతి నీకెందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏపీ సంగతులతో నీకేం పని అంటున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ దేశంలో మాకు భాగస్వామ్యం లేదా? మాకు నోరు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇవాళ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పైనా  పడతారు. ఏపీలో సంగతి మాకెందుకని నోరు మూసుకుని కూర్చోలేం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మావెంట ఎవరుంటారు? మాకెందుకులే అనే పట్టింపులేని తత్వం మంచిది కాదు. మనం మొదట భారతీయులం... ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాస సమితి సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మున్ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటు పరం చేస్తామంటారేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు. సింగరేణి, తదితర సంస్థలను ప్రైవేటీకరిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెగేసి చెప్పారు.

  • Loading...

More Telugu News