Moolinti Mareppa: ఇండియన్ ప్రజా కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మారెప్ప.. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ
- ఐపీసీపీతోనే సామాజిక న్యాయం
- సంక్షేమ పథకాల పేరుతో జగన్ మెతుకులు విసురుతున్నారు
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం గర్హనీయం
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మూలింటి మారెప్ప ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ(ఐపీసీపీ) లో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన మారెప్ప తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల బరిలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్టు చెప్పారు.
మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎంతో నిజాయతీగా జీవించానని అన్నారు. ఐపీసీపీతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల పేరుతో పేదలకు మెతుకులు విసురుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పాలనలో రాష్ట్రంలో ఇసుమంతైనా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం గర్హనీయమని మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు.