Mithali Raj: మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు నారా లోకేశ్, మహేశ్ బాబు అభినందనలు
- అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ అరుదైన ఘనత
- అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు
- మిథాలీపై అభినందనల వెల్లువ
- గర్వించేలా చేశావన్న లోకేశ్, మహేశ్ బాబు
టీమిండియా మహిళా వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడమే అందుకు కారణం. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ మిథాలీనే. దాంతో ఆమెను అభినందిస్తూ ప్రముఖులు తమ సందేశాలు పంపుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా మిథాలీ రాజ్ కు అభినందనలు తెలిపారు.
"అంతర్జాతీయస్థాయిలో 10 వేల పరుగులు సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్ కెప్టెన్" అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. మిథాలీ... భారత మహిళా క్రికెట్ కు మూలస్తంభంలా కొనసాగుతోందని, ఔత్సాహిక యువ క్రికెటర్లకు ఓ స్ఫూర్తి అని కొనియాడారు. నిన్ను చూసి గర్విస్తున్నాం మిథాలీ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇక, మహేశ్ బాబు స్పందిస్తూ... మిథాలీ రాజ్ ఓ అద్భుతమైన ఘనత అందుకున్నదంటూ కితాబునిచ్చారు. "మమ్మల్ని అందరినీ గర్వించేలా చేశావు మిథాలీ... ఇలాంటి ఘనతలు మరెన్నో సాధిస్తావు. నీకు వందనాలు చాంపియన్!" అంటూ వ్యాఖ్యానించారు.
కాగా, 10 వేల పరుగులు సాధించిన అంతర్జాతీయ క్రికెటర్లలో మిథాలీది రెండో స్థానం. మిథాలీ కంటే ముందు ఇంగ్లండ్ కెప్టెన్ చార్లోట్ ఎడ్వర్డ్స్ ఈ ఘనత నమోదు చేసింది. చార్లోట్ ఎడ్వర్డ్స్ ఇప్పటివరకు 10,273 పరుగులు చేసింది. మిథాలీ 10,001 పరుగులతో ఎడ్వర్డ్స్ రికార్డును బ్రేక్ చేసేందుకు ఉరకలు వేస్తోంది. టెస్టులు, టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్న మిథాలీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతోంది.