Kishan Reddy: ఏపీ సర్కారు ముందుకొస్తే కేంద్రం స్టీల్‌ప్లాంట్ పై ఆలోచిస్తుంది: కిషన్ రెడ్డి
- స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర నిర్ణయాలు విధానపరమైనవే
- నష్టాల్లో కొనసాగుతోన్న పరిశ్రమను నడపడం భారం
- తమ పరిధిలోకి తీసుకోవడానికి ఏపీ సర్కారు ముందుకొస్తే ఆలోచిస్తాం
- ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ఉంది
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటానికి పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు.
ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. నష్టాల్లో కొనసాగుతోన్న విశాఖ ఉక్కు పరిశ్రమను నడపడం భారమని చెప్పుకొచ్చారు. ఒక వేళ స్టీల్‌ప్లాంట్ ను తమ పరిధిలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విషయంపై కేంద్ర సర్కారు ఆలోచిస్తుందని తెలిపారు. ఉక్కు పరిశ్రమల కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు.