India: ఐదేళ్లలో భారీగా తగ్గిన భారత ఆయుధ దిగుమతులు
- 33% పడిపోయాయన్న సిప్రి నివేదిక
- 9.5% దిగుమతులతో రెండో స్థానంలో భారత్
- 11%తో మొదటి స్థానంలో సౌదీ అరేబియా
- రష్యా నుంచే అధికంగా దిగుమతులు
- ఎగుమతుల్లో భారత్ కు 24వ స్థానం
- ప్రపంచంలో మన వాటా కేవలం 0.2%
విదేశీ ఆయుధ దిగుమతులు భారీగా పడిపోయాయి. 2011–2015 తో పోలిస్తే 2016–2020 మధ్య ఐదేళ్లలో 33 శాతం మేర దిగుమతులు తగ్గాయి. అయినా కూడా ఆయుధ దిగుమతుల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) విడుదల చేసిన అంతర్జాతీయ ఆయుధ కొనుగోళ్ల నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 9.5 శాతమని ఆ నివేదిక పేర్కొంది. జాబితాలో 11 శాతంతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఈజిప్ట్ (5.8%), ఆస్ట్రేలియా (5.1%), చైనా (4.7%)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2.7 శాతంతో పాకిస్థాన్ పదో స్థానంలో నిలిచింది.
ఇక, ఇండియాకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా రష్యానే నిలిచింది. 2016–2020లో భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 49 శాతం రష్యావే ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి 18%, ఇజ్రాయెల్ నుంచి 13 శాతం చొప్పున ఆయుధాలను కొనుగోలు చేసింది. నాలుగో స్థానంలో అమెరికా ఉంది.
సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియల వల్లే భారత ఆయుధ దిగుమతులు తగ్గాయని సిప్రి పేర్కొంది. అంతేగాకుండా విదేశీ ఆయుధాలపై ఆధారపడడం తగ్గించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయమూ అందుకు కారణమైందని పేర్కొంది. వాటితో రష్యా ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువ దెబ్బ పడినా.. అమెరికా ఆయుధాల దిగుమతుల్లోనూ 46 శాతం కోత పడింది.
ప్రస్తుతం భారత సైన్యం వాడుతున్న ఆయుధ వ్యవస్థల్లో 60 శాతం రష్యావేనని నివేదిక పేర్కొంది. ఎస్ 400 క్షిపణుల కోసం 543 కోట్ల డాలర్లు, అణ్వస్త్ర సామర్థ్యమున్న అకులా 1 జలాంతర్గామి లీజు కోసం 300 కోట్ల డాలర్లతో రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుందని వివరించింది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా నిలిచింది. ఎగుమతుల్లో ఆ దేశం వాటా 37%.
ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (20%), ఫ్రాన్స్ (8.2%), జర్మనీ (5.5%), చైనా (5.2%) ఉన్నాయి. ఆ ఐదు దేశాల నుంచే 76 శాతం మేర ఆయుధ ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ జాబితాలో భారత్ 24వ స్థానంలో ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా కేవలం 0.2%. ఎక్కువగా మయన్మార్, శ్రీలంక, మారిషస్ లకు భారత ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి.