Chandrababu: చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారు?: అమరావతి దళిత జేఏసీ
- ఆళ్ల ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు ఎలా పెడతారు?
- ఆళ్ల దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాదు
- ఎఫ్ఐఆర్ లో భూమిలు అమ్మిన, కొన్న వాళ్ల పేర్లు లేవు
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేశారు. దళితుల అసెన్డ్ భూములకు సంబంధించి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై అమరావతి దళిత జేఏసీ మండిపడింది. జేఏసీ నేత మార్టిన్ మాట్లాడుతూ, ఆళ్ల ఫిర్యాదుతో చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కాని వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. ఆళ్ల దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో భూములు అమ్మిన లేదా కొన్న వ్యక్తుల పేర్లు లేవని అన్నారు. చంద్రబాబుపై కక్ష పూరితంగా, రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.