Dr Gurumurthy: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ
- ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు స్థానం ఉపఎన్నికలు
- గురుమూర్తి పేరు ప్రకటించిన వైసీపీ కేంద్ర కార్యాలయం
- గతంలోనే గురుమూర్తి పేరు నిర్ణయం
- ఇప్పటికే తిరుపతి అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ
- కసరత్తులు చేస్తున్న బీజేపీ-జనసేన
తిరుపతి ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ను వెన్నంటే ఉన్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ ఖరారు చేసినట్టు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, తిరుపతి బరిలో డాక్టర్ గురుమూర్తిని దింపాలని కొన్నినెలల కిందటే వైసీపీలో అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని ఇవాళ అధికారికంగా వెల్లడి చేశారు.
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించినా, వారు అందుకు విముఖత వ్యక్తం చేశారు. దాంతో బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ కు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. అనంతరం, ఆయన తన పర్సనల్ డాక్టర్ గురుమూర్తి వైపు మొగ్గుచూపారు.
ఇక, తిరుపతి బరిలో అందరికంటే ముందే టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీజేపీ-జనసేన కూడా త్వరలో తన అభ్యర్థిని ప్రకటిస్తుంది.