Harsh Vardhan: ఇప్పటికిప్పుడు అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయలేం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్​

Every vaccine does not require universal immunisation says Harsh Vardhan on Covid 19 vaccine

  • లోక్ సభలో ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నకు బదులు
  • ప్రపంచంలో ఎక్కడా అది సాధ్యం కాదని కామెంట్
  • వ్యాక్సిన్ అందరికీ వేయాలనేం లేదని వ్యాఖ్య
  • ప్రాధాన్య వర్గాల వారీగానే ఇస్తామని స్పష్టీకరణ

కరోనా టీకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సురక్షితమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో లోక్ సభలో ఆయన మాట్లాడారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

‘‘ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాలనేం లేదు. ప్రస్తుతం వైద్య సిబ్బంది, వృద్ధులు, 45 ఏళ్ల వయసుండి వేరే జబ్బులున్న వారికి కరోనా టీకాలు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత మందికి వేస్తాం. నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకునే ముందుకు సాగుతున్నాం. భారత నిపుణులే కాదు.. ప్రాధాన్య వర్గాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులనూ సలహాలు, సాయం కోరుతున్నాం’’ అని ఆయన వివరించారు.

ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్నారు. అందుకే ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు. శాస్త్రీయ వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకునే ప్రాధాన్య వర్గాలను నిర్ణయించామన్నారు.

ప్రాధాన్య వర్గాలను గుర్తించేందుకు గత ఏడాది ఆగస్ట్ లోనే ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, అన్నింటినీ పరిశీలించే ఆరోగ్య సిబ్బంది, ముందు వరుస యోధులు, వృద్ధులు, జబ్బులున్న వారికి టీకాలు వేస్తున్నామని ఆయన వివరించారు. అన్ని పరీక్షలు చేశాకే వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపామన్నారు. వ్యాక్సిన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News