Sachin Tendulkar: మేము ఆడిన రోజుల్లో పరిస్థితి వేరేగా ఉండేది: సచిన్
- ఐపీఎల్ వల్ల టీమిండియాకు మేలు జరుగుతోంది
- అగ్రశ్రేణి బౌలర్లను యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఎదుర్కొంటున్నారు
- మేము ఆడే రోజుల్లో బౌలర్ల గురించి తెలిసేది కాదు
ఐపీఎల్ వల్ల భారత క్రికెట్ కు ఎంతో మేలు జరుగుతోందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశం కల్పిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన వెంటనే యువ క్రికెటర్లంతా సత్తా చాటుతున్నారని అన్నారు. భారత క్రికెట్ జట్టు రిజర్వ్ బలం పెరగడంలో ఐపీఎల్ ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పారు.
తాము ఆడే రోజుల్లో వసీమ్ అక్రమ్, షేన్ వార్న్, మెర్వ్ హ్యూస్ వంటి దిగ్గజ బౌలర్ల బౌలింగ్ గురించి తమకు ఏమీ తెలిసేది కాదని... పాకిస్థాన్ కో, ఆస్ట్రేలియాకో వెళ్లి నేరుగా వారిని ఎదుర్కొనేవాళ్లమని సచిన్ అన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని... ఐపీఎల్ కారణంగా జోర్డాన్, ఆర్చర్ వంటి బౌలర్లు సూర్యకుమార్ వంటి ఆటగాళ్లకు కొత్తేమీ కాదని చెప్పారు. ఐపీఎల్ లోనే వీరి బౌలింగ్ ను సూర్యకుమార్ ఆడాడని తెలిపారు. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చిందని అన్నారు. ఇలాంటి యువ ఆటగాళ్ల రాకతో టీమిండియా రిజర్వ్ బలం పెరిగిందని చెప్పారు.