Supreme Court: రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు?: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రాలు అనేక సంక్షేమ పథకాలను చేపట్టాయి
- వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందలేదని చెప్పగలమా?
- పరిమితి లేని రిజర్వేషన్ల వల్ల ఏర్పడే అసమానతల మాటేమిటి?
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారీ విచారణను కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచిందని... రాష్ట్రాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయని... ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందలేదని మనం అంగీకరించగలమా? అని ప్రశ్నించింది.
అసలు ఇంకెన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
పరిమితి లేకుండా రిజర్వేషన్లను పెంచుకుంటూ పోతే... సమానత్వానికి ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పరిమితి లేని రిజర్వేషన్ల వల్ల ఏర్పడే అసమానతల మాటేమిటని అడిగింది. మరెన్ని తరాలకు రిజర్వేషన్లను కల్పిస్తారని ప్రశ్నించింది. వెనకబాటుతనం నుంచి బయటపడిన కులాలను రిజర్వేషన్ల నుంచి తొలగించాలన్న మండల్ తీర్పుపై సమీక్ష జరగాలని చెప్పింది.